మీరు జీవితంలో ఎన్నో లక్ష్యాలను, కలలనూ కలిగి ఉండవచ్చు. ఆ కలలను సాకారం చేసుకోవడానికీ, లక్ష్యాలను సాధించడానికీ మీరు మీ కష్టార్జితాన్ని పెట్టుబడి పెడతారు. మీరు ఉన్నంత కాలం, ఆ తదనంతరం కూడా, మీ ఆప్తులు తమ కలలను సాకారం చేసుకునేందుకు కూడా మీరు పెట్టుబడి పెట్టవచ్చు.
ప్రతి వ్యక్తికీ జీవితంలో కొన్ని లక్ష్యాలు ఉంటాయి, సాకారం చేసుకోవలసిన కలలు ఉంటాయి. ప్రతి లక్ష్యానికీ ఒక ప్రణాళిక కూడా అవసరం, ఆర్ధిక ప్రణాళిక అనేది మరీ ప్రథానంగా. ఎవరైనా తమ కలల్ని నిజం చేసుకునేందుకూ,తమ ఆప్తుల కలలను, కోరికలను నెరవేర్చేందుకూ తమ కష్టార్జితాన్ని పెట్టుబడి పెడతారు.
జీవితం మనం అనుకున్నట్లుగా సాగదు, ఎన్నో అనుకోని సంఘటనలు జరగవచ్చు. తమ తదనంతరం తమ పెట్టుబడులు ఆటోమ్యాటిక్ గా తన జీవిత భాగస్వామికి గానీ పిల్లలకు గానీ చేరాలని ప్రతి ఒక్కరూ భావిస్తారు. కానీ నిజ జీవితంలో, అది అంత సులువైన ప్రక్రియ కాదు. అది ఎలానో తెలుసుకునేందుకు, రాజీవ్ గుప్తా ఉదాహరణను తీసుకుందాం.
రాజీవ్ గుప్తా నాలుగు పోర్ట్ ఫోలియోలను రూపొందించారు, ఒకటి తన లక్ష్యాల కోసం, ఒకటి తన భార్య యొక్క ఆర్ధిక భద్రత కోసం, ఇక మిగిలినవి తన పిల్లల చదువుల కోసం. అతని మ్యూచువల్ ఫండ్ సిప్ లు కూడా తదనుగుణంగానే ప్రణాళిక చేయబడ్డాయి.
అదృష్టవశాత్తు, రాజీవ్ గుప్తా తెలివిగా తన ప్రతి పోర్ట్ ఫోలియోకి ఒక నామినీని కేటాయించారు. నామినేషన్ అనే ఒక చిన్న స్టెప్ తో, సముచితమైన నామినీకి పోర్ట్ ఫోలియోలు ట్రాన్స్ఫర్ అయ్యేలా రాజీవ్ నిర్ధారించుకున్నారు, ఏమి జరిగినా తన లక్ష్యం సాధ్యమవుతుంది.
ఎం ఎఫ్ నామినేషన్లు
తమ తదనంతరం కనీస పేపర్ వర్క్ తో, తమ మ్యూచువల్ ఫండ్ ఫోలియో, డీమ్యాట్ అకౌంట్ లేదా బ్యాంక్ అకౌంట్ లోని నగదును క్లెయిం చేసుకునేందుకు తమ ఆప్తులకు మార్గాన్ని సులభతరం చేసే, ఒక ఖర్చులేని మార్గం ఈ నామినేషన్.
యూనిట్ల విషయంలో చేసే నామినేషన్, యూనిట్ హోల్డర్ తదనంతరం, ఆస్తులపై హక్కును ఏర్పరచదు. అందరు యూనిట్ హోల్డర్లూ మరణించిన తర్వాత మాత్రమే నామినీ(ల)కు యూనిట్ల మీద హక్కు సంక్రమిస్తుంది. ఈ నామినేషన్ ద్వారా ఆస్తిలో ఎటువంటి హక్కునూ లేదా ప్రయోజనకర లాభాన్ని గానీ నామినీ పొందరనే విషయాన్ని గుర్తించవచ్చు. నామినీ(లు) సందర్భానుసారంగా చట్టపరమైన వారసులకు లేదా వీలునామాలో పేర్కొన్న వారసులకు ఒక ఏజెంట్ గానో లేదా ట్రస్టీగానో మాత్రమే యూనిట్లను పొందుతారు.
ఎంఎఫ్ లకు నామినేషన్ తప్పనిసరా?
ఎంఎఫ్ మదుపుదారులకు నామినేషన్ తప్పనిసరి. అక్టోబరు 1, 2022 నుండి, ఎంఎఫ్ యూనిట్లకు సబ్స్క్రైబ్ చేసుకునే కొత్త మదుపుదారులు తప్పనిసరిగా ఒక నామినీని కేటాయించవలసి ఉంటుంది లేదా నామినేషన్ ఎంచుకునేందుకు ఒక డిక్లరేషన్ ఫారం నింపవలసి ఉంటుంది. ప్రస్తుత మదుపుదారులు కూడా మార్చి 31, 2023 నాటికి, తమ పాత పెట్టుబడులలో ఒక నామినీని కేటాయించవలసి ఉంటుంది లేదా నామినేషన్ ఎంచుకోవలసి ఉంటుంది. పెట్టుబడులు ఉమ్మడిగా ఉన్నాయా లేదా ఒకరికి మాత్రమే చెందినవా అన్న దానితో సంబంధం లేకుండా ఇది వర్తిస్తుంది.
ఎంఎఫ్ పెట్టుబడులకు నామినీలను చేర్చడం ఎలా?
సమీప ఎఎంసి/ఆర్టిఎ శాఖలో ఒక దరఖాస్తు పత్రాన్ని వ్యక్తిగతంగా సమర్పించడం ద్వారా మీ మ్యూచువల్ ఫండ్ హోల్డింగులో నామినీలను మీరు చేర్చవచ్చు లేదా అప్డేట్ చేయవచ్చు. ప్రత్యామ్నాయంగా, ఎఎంసి/ఆర్టిఎ వెబ్సైట్ లో లేదా mfcentral.comలో కూడా ఇధి చేయవచ్చు. మీ అకౌంట్లోకి లాగిన్ అయ్యి, నామినీలను చేర్చాలనుకుంటున్న/అప్డేట్ చేయాలనుకుంటున్న ఫోలియోని ఎంచుకోండి. పేరు, చిరునామా వంటి వివరాలతో పాటూ, ప్రతి నామినీ పొందగల కర్తృత్వ (ఓనర్షిప్) శాతంతో నామినీ వివరాలను నింపండి. కర్తృత్వ శాతం పేర్కొనని పక్షంలో, ప్రతి నామినీ సమాన వాటాను పొందడానికి అర్హులు. నామినీ అప్డేషన్ అభ్యర్ధనను వెరిఫై చేసేందుకు టూ-ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ లో భాగంగా ఒక ఓటిపి మీకు వస్తుంది. ప్రత్యామ్నాయంగా, ఇ-సంతకం సౌకర్యంతో డిజిటల్ పత్రం మీద సంతకం చేయవచ్చు.
మీ ఫోలియోలో నామినీ వివరాలను చేర్చేందుకు/అప్డేట్ చేసేందుకు మీకు ఆన్లైన్ లో సౌకర్యవంతంగా అనిపించని పక్షంలో, మీరు ఫండ్ హౌజ్ యొక్క ఇన్వెస్టర్ సర్వీస్ సెంటర్ ను లేదా సమీప శాఖను సందర్శించవచ్చు. చేర్చాలనుకుంటున్నా/అప్డేట్ చేయలనుకుంటున్నా అకౌంట్/ఫోలియో వివరాలను, నామినీల పేర్లను మీరు పేర్కొనవలసి ఉంటుంది. అకౌంట్/ఫోలియోలో ఒకటి కన్నా ఎక్కువ మంది నామినీలు ఉన్న పక్షంలో, నామినీలందరికీ ఎంతెంత వాటా కేటాయించాలనుకుంటున్నారో మీరు పేర్కొనవలసి ఉంటుంది. ఇంకా, జాయింట్ హోల్డింగ్ అయితే, యూనిట్ హోల్డర్లు అందరూ, పత్రం మీద సంతకం చేయవలసి ఉంటుంది.
చివరగా
ఒక మదుపుదారుడు తన అకౌంట్ లో ఒక నామినీని పేర్కొనని పక్షంలో లేదా నామినేషన్ ఎంచుకోని పక్షంలో, చట్టపరమైన వారసులు మాత్రమే తమ చట్టపరమైన వారసత్వాన్ని ధృవీకరించుకున్న మీదట పెట్టుబడులను క్లెయిం చేసుకెవచ్చు. ఇది ఏమైనా ఒక దీర్ఘకాలం నడిచే ప్రక్రియ. కాబట్టి, మీ మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు అన్నింటిలో నామినీ/లను కలిగి ఉండడం మంచిది. తద్వారా దురదృష్ట పరిస్థితులలో ఆస్తులను సునాయసంగా ట్రాన్స్ఫర్ చేయవచ్చు.
కాబట్టి మీమ్యూచువల్ ఫండ్ పెట్టుబడి అకౌంట్లు అన్నింటినీ నామినీ వివరాలతో అప్డేట్ చేయడం ద్వారా, దురదృష్టకర పరిస్థితులలో మీ పెట్టుబడులను క్లెయిం చేసుకునేందుకు మీ కుటుంబసభ్యులు తమ చట్టపరమైన వారసత్వాన్ని ధృవీకరించుకోవలసి వచ్చే సంకటం నుండి వారిని కాపాడండి.